human rights: దిశ హత్యాచార నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్: పౌరహక్కుల సంఘం
- పథకం ప్రకారమే కాల్చిచంపారు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- కుటుంబ సభ్యులను కలిసి విచారించిన ప్రతినిధులు
దిశ హత్యాచార ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న వారిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు. ఎవరి ప్రయోజనాలో కాపాడడం కోసం లేదా మరో ఉద్దేశంతోనో పోలీసులు పథకం ప్రకారం ఈ మారణకాండకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. బాధ్యులైన వారిపై జాతీయ మానవ హక్కుల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బృందం నిన్న ఎన్‌కౌంటర్ బాధితుల తల్లిదండ్రులను నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో కలిసి విచారించారు. పలు అంశాలు వారితో మాట్లాడి తెలుసుకున్నారు.
అనంతరం లక్ష్మణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిందితులు చేసింది ముమ్మాటికీ నేరమేనన్నారు. అయినప్పటికీ విచారణ లేకుండా శిక్షించే అధికారం పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. బాధితుడైన దిశ తండ్రి కూడా సత్వర న్యాయం డిమాండ్ చేశారు తప్ప ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని కోరలేదని గుర్తు చేశారు.
నిందితులు పరుగెత్తే స్థితిలో లేరని, వారికి తుపాకీ పేల్చడం రాదని వారి తల్లిదండ్రులు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. నిందితులు ఎదురు తిరగాలని అనుకుంటే వారిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చినప్పుడే ఎదురు తిరిగే వారని చెన్నకేశవుల తండ్రి కురుమయ్య మాటలు ప్రస్తావనార్హమన్నారు.
దిశ సెల్ ఫోన్ సంఘటన స్థలంలో దొరికిందని పోలీసులు చెబుతుంటే, గుడిగండ్ల గుట్టమీద దొరికిందని నవీన్ తల్లి లక్ష్మి చెబుతోందన్నారు. ఇటువంటి అంశాలన్నీ పోలీసుల తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు.