Nirbhaya: మేము తలారీలుగా వ్యవహరిస్తాం: తీహార్ జైలు అధికారులకు లేఖల పరంపర
- మొత్తం పదిహేను లేఖలు అందాయన్న అధికారులు
- అందులో లండన్ నుంచి ఒకరు, అమెరికా నుంచి మరొకరు
- తలారీ కోసం వెతుకుతున్నారన్న వార్త నేపథ్యంలో స్పందన
నిర్భయ హత్య కేసులో దోషులకు ఉరివేసేందుకు తలారీలు లేరన్న వార్తల నేపథ్యంలో అవకాశం ఇస్తే తాము ఆ బాధ్యత చేపట్టి ఉరి తీసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తీహార్ జైలు అధికారులకు లేఖల పరంపర పెరిగింది. ఇప్పటికే పదిహేను మంది నుంచి లేఖలు అందినట్లు, అందులో రెండు లేఖలు విదేశాల నుంచి కూడా అందినట్లు జైలు అధికారులు తెలిపారు.
ఢిల్లీ, గురుగ్రాం, ముంబై, చత్తీస్గడ్, కేరళ, తమిళనాడు నుంచి ఈ లేఖలు అందాయని చెబుతున్నారు. అలాగే ఒకరు లండన్ నుంచి మరొకరు అమెరికా నుంచి లేఖలు రాసినట్లు చెప్పారు. విదేశాల నుంచి లేఖలు రాసిన వారిలో ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ కాగా, మరొకరు న్యాయవాది.
అయితే ప్రస్తుతానికి ఇటువంటి సేవలు జైలుకు అవసరం లేదని అధికారులు తెలిపారు. నిర్భయ దోషులతో పాటు తీహార్ జైలులో ప్రస్తుతం 12 మందికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. జైల్లో తలారీ లేకపోవడంతో మీరట్ నుంచి రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.