Central Information broad casting ministry guide lines to private TV channels: అసోంలో ఆందోళనల నేపథ్యంలో.. టీవీ ఛానళ్లకు కేంద్రం మార్గ దర్శకాలు
- పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో శ్రుతిమించిన ప్రజాఆందోళనలు
- దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు టీవీ ఛానళ్లు ప్రసారాలు చేయాలి
- కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 1905 నిబంధన అతిక్రమించరాదు
దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రైవేటు టీవీ ఛానళ్లు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖ సూచించింది. ముఖ్యంగా నిరసనలు, ప్రజాందోళనలకు సంబంధించి వార్తలు, కార్యక్రమాలను ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్త అవసరమని వ్యాఖ్యానించింది. ఈ తరహా వార్తలు, దృశ్యాలు ప్రసారం చేసే సమయంలో ఛానళ్లు అనుసరించాల్సిన పద్ధతులకు సంబంధించి మార్గనిర్దేశకాలను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
మూడు సరిహద్దు దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పౌరసత్వ సవరణ బిల్లు’ను పార్లమెంట్ ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ..అసోంలో ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సైన్యం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అంతేకాక, ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈ చర్యలకు ఉపక్రమించింది. దేశ సమగ్రతను ప్రభావితం చేసే అంశాలను ప్రసారం చేసేటప్పుడు అప్రమత్తత అవసరమని తెలిపింది. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ లోని 1905 నిబంధనకు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి కంటెంట్ అయినా సరే.. వాటిని ప్రసారం చేయరాదని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.