Andhra Pradesh: ‘ఇంగ్లీషు’ నాకు అర్థమవుతుంది తప్ప మాట్లాడలేను: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
- టెస్త్ క్లాస్ వరకు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో చదివాను
- ఇంటర్మీడియట్ కోసం ఏలూరులో చేరాను
- ‘ఇంగ్లీషు’ రాక 3 నెలలు ఇబ్బందిపడ్డాను
టాలెంట్ కు చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన అని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, తాను చదువుకునే రోజుల్లో ‘ఇంగ్లీషు’ రాక ఎంత ఇబ్బండిపడాల్సి వచ్చిందో గుర్తుచేసుకున్నారు.
తాను టెస్త్ క్లాస్ వరకు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో చదివానని, ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్య కోసం ఏలూరులోని సెయింట్ థెరిస్సాలో చేరినప్పుడు తనకు ‘ఇంగ్లీషు’ రాకపోవడంతో మూడు నెలల పాటు అన్ని సబ్జెక్టులూ ఫెయిల్ అయినట్లు చెప్పారు. దీంతో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతానన్న భయమేసి, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చేశానని, జంగారెడ్డి గూడెంలో మరో కాలేజీలో తెలుగు మీడియంలో చేరిన విషయాన్ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ పాసైన తర్వాత డిగ్రీలో ఇంగ్లీషు మీడియం తీసుకుని పాసయ్యానని అన్నారు.
ఇప్పుడు ఇంగ్లీషు భాష తనకు అర్థమవుతుంది తప్ప మాట్లాడటం రాదని పుష్పశ్రీ వాణి చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా గిరిజన విద్యార్థులు నిర్వహించిన ఓ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఇటీవల వెళ్లానని, ఆయా ప్రయోగాల గురించి విద్యార్థులు ‘ఇంగ్లీషు’లో వివరించి చెబుతుంటే తనకు అర్థమవుతోంది గానీ, తిరిగి అదే భాషలో వారికి సమాధానం చెప్పలేకపోవడంతో తాను చాలా బాధపడ్డానని అన్నారు. ఈ విషయం చెప్పడానికి తానేమీ సిగ్గుపడటం లేదన్నారు. ‘బడుగు, బలహీన వర్గాల పిల్లలు కూడా చదువుకోవాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఆ రోజున వుండి ఉంటే, ఈరోజు మేము కూడా ‘ఇంగ్లీషు’లో చాలా బాగా మాట్లాడి పేరు తెచ్చుకునేవాళ్లమని అనిపిస్తుంటుంది’ అని మంత్రి అన్నారు.