janasena: కాకినాడలో నిరాహార దీక్ష విరమణ.. అన్నదాత కన్నీరు ఆగే వరకూ మా పోరాటం ఆగదు: పవన్ కల్యాణ్
- పవన్ కు నిమ్మరసం ఇచ్చిన రైతులు
- దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
- రైతుకు పట్టం కట్టేందుకే ‘జనసేన’ ఉంది
‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది. పవన్ కు నిమ్మరసం ఇచ్చిన రైతులు ఆయన దీక్షను విరమింపజేశారు. అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
రైతుకు పట్టం కట్టేందుకే ‘జనసేన’ ఉందని, అన్నదాత కన్నీరు ఆగే వరకూ తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మాయమాటలు చెబుతున్నవాళ్లు బాగున్నారని, రైతులే కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా ఓటమిపాలైతే ఆ పార్టీకి చెందిన వారి ఆత్మసైర్యం దెబ్బతింటుంది కానీ, తనకు మాత్రం ఆత్మస్థైర్యం దెబ్బతినలేదని అన్నారు.