Congress: హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది: రేవంత్ రెడ్డి
- బంగారు తెలంగాణ నుంచి బాకీల తెలంగాణగా మార్చారు
- మరోసారి సంక్షేమం, అభివృద్ధిని అలక్ష్యం చేశారు
- ఆరేళ్ల పాలనలో రూ.3 లక్షల కోట్ల అప్పు పైబడింది
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో విపక్షాల విమర్శలు ఊపందుకున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సంక్షేమం, అభివృద్ధిని అలక్ష్యం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదంటూ ధ్వజమెత్తారు.
రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ తో కొత్త రాష్ట్రంగా ప్రయాణం మొదలు పెట్టిన తెలంగాణ ఆరేళ్లు గడిచేసరికి రూ.3 లక్షల కోట్ల అప్పుతో ఉందని విమర్శించారు. రాష్ట్రం ఇప్పుడు బంగారు తెలంగాణ కాదని, బాకీల తెలంగాణగా మారిందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్ మెంట్ ,ఆరోగ్య శ్రీ తదితర హామీలు నెరవేర్చలేకపోయారని, అభివృద్ధిని మరిచారని ఆయన మండిపడ్డారు.