Tirumala: తిరుమలలో వెలుగులోకి మరో నయా మోసం
- ఐఆర్ఎస్ అధికారినంటూ జేఈఓ కార్యాలయానికి నకిలీ లేఖలు
- ముంబయిలో ఇంటెలిజెన్స్ ఏసీగా నమోదు
- నకిలీవని తేలడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు
తిరుమలలో సిఫారసు లేఖల విషయంలో మరో నయామోసం బయటపడింది. తాను ఐఆర్ఎస్ అధికారినని, ముంబయిలో ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నానంటూ గుంటూరుకు చెందిన వెంకటరత్నారెడ్డి శ్రీవారి దర్శనానికి పంపిన సిఫారసు లేఖలు నకిలీవని జేఈఓ కార్యాలయం సిబ్బంది గుర్తించారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ తంతును గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గతంలోనూ ఇదే తరహాలో నకిలీ లేఖలతో రత్నారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. నకిలీ అధికారి బాగోతం బయటపడడంతో ఉన్నతాధికారులు పంపే సిఫారసు లేఖలను కూడా జేఈఓ కార్యాలయం సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.