west Indies cricketer Dwane Bravo Re entering: మళ్లీ క్రికెట్ బరిలోకి విండీస్ క్రికెటర్ బ్రావో
- రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకున్న ఆల్ రౌండర్
- 2018 అక్టోబర్ లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన క్రికెటర్
- టీ20 ఫార్మాట్లో మళ్లీ రంగప్రవేశం చేసేందుకు సిద్ధం
వెస్టిండీస్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ ద్వానే బ్రావో మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. బ్రావో 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్రావో తన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తన అభిమానుల నుంచి వస్తోన్న అభ్యర్థనలు ప్రభావితం చేశాయని చెపుతూ.. టీ20 ఫార్మాట్లో మళ్లీ ఆడతానని చెప్పాడు.
‘మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడతానని వస్తోన్న వార్తలు నిజమే. ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాను. నేను అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయాలని అభిమానులు, నా శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఇందులో రహస్యమేమీ లేదు. విండీస్ బోర్డు పాలన స్థాయిలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేస్తున్నాను’ అని అన్నాడు.
2012, 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ గెలిచిన విండీస్ జట్టులో బ్రావో సభ్యుడు. విండీస్ బోర్డుతో కొన్ని సార్లు విభేదించిన బ్రావో చివరికి 2018లో రిటైర్మైంట్ ప్రకటించాడు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ జట్టులోకి బ్రావో పేరును జట్టు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బోర్డు చేర్చింది.. కానీ బ్రావోకు ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ లో బ్రావో చైన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.