Ranji Trophy: రంజీ చరిత్రలో గొప్ప జట్లకు సాధ్యం కాని రికార్డు నమోదు చేసిన ఝార్ఖండ్
- ఫాలో ఆన్ లో పడ్డా చివరికి గెలిచిన ఝార్ఖండ్
- త్రిపురపై విజయం
- 85 ఏళ్ల రంజీ చరిత్రలో తొలి జట్టుగా రికార్డు
భారత దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ ఫాలో ఆన్ ఆడి విజయం సాధించలేదు. కానీ పెద్దగా పేరులేని ఝార్ఖండ్ జట్టు అద్భుతంగా ఆడి ఫాలో ఆన్ గండం గట్టెక్కడమే కాదు, ఏకంగా విజయాన్ని నమోదు చేసింది. రంజీ ట్రోఫీ ప్రారంభమై 85 ఏళ్లు కాగా, ముంబయి, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు వంటి అగ్రశ్రేణి జట్లు సైతం ఫాలో ఆన్ విజయాన్ని సాధించలేకపోయాయి. తాజాగా, త్రిపుర జట్టుతో అగర్తలా వేదికగా జరిగిన మ్యాచ్ లో ఝార్ఖండ్ ఈ ఘనత తన పేరిట లిఖించుకుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు 289 పరుగులు చేయగా, బదులుగా తొలి ఇన్నింగ్స్ లో ఝార్ఖండ్ 136 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఝార్ఖండ్ ఫాలో ఆన్ లో పడడంతో వెంటనే మరోసారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అప్పటికి 153 పరుగుల లోటు ఉంది. కానీ ఫాలో ఆన్ లో ఆ జట్టు అద్భుతంగా పుంజుకుంది. కెప్టెన్ సౌరభ్ తివారీ, ఇషాంక్ జగ్గీ అజేయ సెంచరీలతో చెలరేగారు. దాంతో ఝార్ఖండ్ 418/8 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి త్రిపుర ముందు 256 పరుగుల లక్ష్యాన్నుంచింది.
కానీ ఝార్ఖండ్ బౌలర్ల ధాటికి త్రిపుర 211 పరుగులకే ఆలౌటైంది. మొత్తమ్మీద తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్ లో కోలుకున్న ఝార్ఖండ్ 54 పరుగుల తేడాతో మ్యాచ్ ను చేజిక్కించుకుంది. 1934లో రంజీ ట్రోఫీ ప్రారంభం కాగా, ఇప్పటివరకు ఇలా పడిలేచి, గెలిచిన జట్టు లేదు!