Andhra Pradesh: 'ఏపీ దిశ' చట్టం ఎంత పదునైనదంటే... వివరాలు ఇవిగో!
- దిశ చట్టం బిల్లును తీసుకువచ్చిన ఏపీ సర్కారు
- అసెంబ్లీలో ఆమోదం
- నిర్భయ చట్టం కంటే మరింత కఠినంగా దిశ చట్టం
దిశ పేరుతో ఏపీ ప్రభుత్వం చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఇటీవల తెలంగాణ గడ్డపై చోటుచేసుకున్న దిశ ఘటన అనేక రాష్ట్రాలను ఆలోచింపజేసింది. అయితే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఏపీ సీఎం జగన్ దిశ పేరుతో కఠినమైన చట్టాన్ని తీసుకువస్తున్నారు. ఈ దిశ చట్టం ముఖ్యాంశాలు ఇవే...
- అత్యాచారాలకు పాల్పడినట్టు తేలితే తప్పనిసరిగా మరణశిక్ష విధిస్తారు. నిర్భయ చట్టంలో అత్యాచారాలకు జైలు శిక్ష కూడా ఉంది. కానీ దిశ చట్టంలో మహిళలపై అత్యాచారాలకు కఠినమైన రీతిలో మరణశిక్షకు మాత్రమే చోటిచ్చారు.
- మహిళలపై అత్యాచారాలే కాదు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులు, ఇతర అఘాయిత్యాలను కూడా దిశ చట్టంలో శిక్షార్హం చేశారు. అయితే, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి దిశ చట్టం ప్రకారం జీవితఖైదు విధించే అవకాశం కూడా ఉంది. కేసు తీవ్రతను అనుసరించి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం తీసుకువచ్చిన పోక్సో చట్టంలో ఈ నేరం కింద దోషులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధిస్తున్నారు. దిశ చట్టంలో దీన్ని జీవితఖైదుకు పెంచారు.
- అన్నింటికంటే ముఖ్యంగా, దిశ చట్టాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నది దీని విచారణ గడువు. కేవలం 21 రోజుల్లో దర్యాప్తు, వాదనలు వినడం, తీర్పు అన్నీ జరిగేలా పకడ్బందీగా రూపొందించిన చట్టం ఇది. నిర్భయ చట్టంలో అయితే 2 నెలల్లో దర్యాప్తు, మరో 2 నెలల్లో తీర్పు ఇస్తున్నారు. ఇప్పుడు ఏపీలో దిశ చట్టం కారణంగా మూడంటే మూడు వారాల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది.
- అంతేకాదు, దోషులు పైకోర్టులను ఆశ్రయించే వ్యవధిని 6 నెలల నుంచి 3 నెలలకు తగ్గించారు.
- ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. అత్యాచారాలే కాదు, యాసిడ్ దాడులు, సామాజిక మాధ్యమాల్లో దూషించడం, ఇతర వేధింపులతో పాటు పోక్సో నేరాలను కూడా ఈ కోర్టు విచారిస్తుంది.
- దిశ చట్టం కింద దర్యాప్తు, విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తోంది. జిల్లా స్థాయిలో డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు, ప్రత్యేకంగా కోర్టులు, వాటిల్లో ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకునే అవకాశం కల్పిస్తున్నారు. కేంద్ర చట్టాల్లో ఇలాంటి ఏర్పాట్లు లేవు.
- మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక నేరాల నమోదు కోసం ఓ డిజిటల్ రిజిస్టర్ ఉంటుంది. దీనిద్వారా నేరస్తుల వివరాలను ప్రజలకు తెలియజేస్తారు. వారి పేరు ఏంటి, వారు ఏం నేరం చేశారనేది ప్రజలకు తెలుస్తుంది. కేంద్రంలో కూడా ఇలాంటి డిజిటల్ వ్యవస్థ ఉన్నా వ్యక్తుల పేర్లను, వారు చేసిన నేరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు.
- దిశ చట్టంలో సామాజిక మాధ్యమాల్లో చోటుచేసుకునే వేధింపులకు సంబంధించిన నేరాలకు కూడా శిక్షలు నిర్ధారించారు. ఇప్పటివరకు సోషల్ మీడియా వేధింపులకు స్పష్టమైన శిక్షలంటూ లేవు. ఇప్పుడు మహిళలను సోషల్ మీడియాలో వేధిస్తే మొదటి తప్పునకు రెండేళ్లు, ఆ తర్వాత తప్పునకు నాలుగేళ్లు శిక్ష విధిస్తారు. సామాజిక మాధ్యమాల్లోనే కాదు ఈమెయిల్స్ ద్వారా దూషించినా ఈ చట్టం వర్తిస్తుంది.