Ambati Criticism against Telugudesam Rule: అవినీతిపై పెదాలతో మాట్లాడను..గుండెతో మాట్లాడతాను: అంబటి
- టీడీపీ అవినీతిని పెంచి పోషించింది
- 2016లో అవినీతిలో ఏపీ అగ్ర స్థానంలో ఉంది
- 2017లో రెండో స్థానంలో ఉందని ఎద్దేవా
ఏపీలో గత ప్రభుత్వం హయాంలో నెలకొన్న అవినీతి రాష్టమంతా విస్తరించిందన్నారు. అసెంబ్లీలో అవినీతిపై జరిగిన చర్చలో అంబటి పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందన్నారు. అవినీతి ఒక దశకు చేరిన తర్వాత విరుగుడు ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న వయసులోనే సీఎం అయ్యారని చెబుతూ.. జగన్ అవినీతి నిర్మూలనకు పాటుపడతారని ప్రజలు ఆయనకు ఓటేశారని, ప్రతిపక్ష నేతలు ఇది గుర్తించాలని అన్నారు. అవినీతి నిర్మూలనకు ఆయన కట్టుబడి కఠోర నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. అలాంటి సీఎంను అందరూ ఆశీర్వదించాలన్నారు.
2016లో అవినీతిలో ఏపీ నెంబర్ 1
ఎన్ సీఈ ఎఆర్( నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్) సంస్థ దేశంలో నెలకొన్న అవినీతిపై 2016లో జరిపిన అధ్యయనంలో రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందని ఎద్దేవా చేశారు. దీనికి టీడీపీ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. 2017లో అవినీతిపై సీఎంఎస్ చేసిన అధ్యయనంలో కూడా ఏపీ రెండో స్థానంలో ఉందని తేల్చిందని చెప్పారు. తాను అవినీతిపై మాట్లాడేటప్పుడు తన పెదాలతో పలకనని.. గుండెతో మాట్లాడుతానని అంబటి అన్నారు.
ఇదివరకు ట్రాన్స్ ఫర్లలో, కాంట్రాక్టుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు డబ్బులు తీసుకునేవారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆన్ గోయింగ్ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఒక శ్వేత పత్రం విడుదల చేసిందన్నారు. అందులో 40 ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుండగా వాటిని పూర్తిచేయడానికి రూ.17,368 కోట్ల ఖర్చువుతుందని చెప్పిందని, ఐదేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టులపై చేసిన ఖర్చు రూ.67,500 కోట్లని, అయినప్పటికీ.. ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదని విమర్శించారు. ఇది టీడీపీ పాలనలో నెలకొన్న అవినీతికి అతిపెద్ద తార్కాణమన్నారు.
అవినీతిని నిర్మూలించకపోతే.. సమాజం అభివృద్ధి చెందదన్నారు. అవినీతిని రూపుమాపితే అభివృద్ధి దానంతటదే జరుగుతుందన్నారు. ఈ ఏడాది నవంబర్ 10 వరకు రూ.1213.33 కోట్లు ఆదా అయ్యాయని తమ మంత్రి చెప్పారని, ఆ తర్వాత ఇప్పటికి రూ.1400 కోట్లు ఆదా అయిందని మంత్రి చెప్పారని అన్నారు. ఇదంతా రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమయిందన్నారు. చంద్రబాబు హయాంలో టెండర్లు ఎవరికిస్తారో ముందే నిర్ణయించేవారన్నారు. ఇన్ని కోట్లు ఆదా చేసిన జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకునే హృదయం చంద్రబాబుకు ఉందా? అంటూ అంబటి ప్రశ్నించారు.