Amalapuram: మాజీ ఎంపీ హర్షకుమార్ కు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
- హర్షకుమార్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- 14 రోజుల రిమాండ్ విధింపు
- అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నా నన్ను అరెస్టు చేశారు: హర్షకుమార్
జ్యుడీషియల్ సిబ్బందిపై దూషణ, విధులకు ఆటంకం కలిగించిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయనను రాజమండ్రి 7వ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హర్షకుమార్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
అనంతరం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయనను పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా ఆయన్ని పలకరించగా, తనను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అరెస్టు చేశారని చెప్పారు. కాగా, దాదాపు డెబ్బై ఐదు రోజులుగా హర్షకుమార్ పరారీలో ఉన్నారు. ఈరోజు రాజమండ్రికి వచ్చిన ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.