muscat: మస్కట్ విమానాశ్రయంలో భార్యను వదిలేసి పరారైన భర్త.. పాతబస్తీ మహిళ దీనావస్థ!
- 14 ఏళ్ల వయసులో మస్కట్ వ్యక్తితో వివాహం
- ఇప్పుడే వస్తానని చెప్పి, విమానాశ్రయంలో వదిలేసిన భర్త
- ఫ్రీపాస్పై హైదరాబాద్ పంపిన అధికారులు
కట్టుకున్న భార్యను విమానాశ్రయంలో వదిలేసి వెళ్లిపోయాడో భర్త. చేతిలో చిల్లిగవ్వలేక దిక్కుతోచక అల్లాడుతున్న ఆమె దీనావస్థను గుర్తించిన అధికారులు ఆమెను హైదరాబాద్‌కు పంపగా, ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది.
హైదరాబాద్, పాతబస్తీలోని సలాలమీకి చెందిన బాధితురాలి పేరు ఆలియా (23). ఆమె ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు అహ్మద్, ఆశ మృతి చెందారు. దీంతో ఆలియాను బాబాయి పెంచి పెద్ద చేశాడు. ఆమెకు 14 ఏళ్లు వచ్చాక మస్కట్‌కు చెందిన అమీన్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు భర్తతో కలిసి మస్కట్‌లోని ఉమాన్ బీ పట్టణానికి వెళ్లింది. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.
తాజాగా, హైదరాబాద్ వెళ్దామని ఆమెకు చెప్పిన అమీన్ ఈ నెల 11న రాత్రి మస్కట్ విమానాశ్రయానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో గంటలపాటు విమానాశ్రయంలో నిరీక్షించింది. గంటలపాటు అక్కడే నిలబడిన ఆమెను చూసిన అధికారులు విషయం ఆరా తీశారు. పాస్‌పోర్టు పరిశీలించి ఉచిత పాస్‌పై జెట్ విమానంలో ఆమెను శంషాబాద్ పంపించారు.
హైదరాబాద్ చేరుకున్న ఆమె తోటి ప్రయాణికుల సాయంతో గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. శుక్రవారం ఉదయం వరకు స్టేషన్లోనే ఉన్న ఆమెను చూసిన ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ పోలీసులు ఆమెకు అండగా నిలిచారు. ‘దివ్య దిశ’ స్వచ్ఛంద సంస్థకు ఆమెను అప్పగించారు.