Disha: జగన్ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు!
- ఏపీ అసెంబ్లీ 'దిశ' బిల్లుకు ఆమోదం తెలిపినందుకు హర్షం
- లైంగిక వేధింపులపై వేగంగా విచారణ జరుగుతుంది
- ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరం
'దిశ' యాక్ట్ ను తీసుకొచ్చిన ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. 'మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వేగంగా విచారణ జరపడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా 'ఏపీ దిశ' బిల్లుకు ఆమోద ముద్ర వేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను' అని వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నేపథ్యంలో మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆమె పేరిటే చట్టాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ నిన్న ఆమోదించింది. అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి ఈ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారు. విచారణ కూడా వేగవంతంగా జరుగుతుంది.