Revanth Reddy: కేంద్ర వైఫల్యాలపై పోరాడేందుకే 'భారత్ బచావో' ర్యాలీ: రేవంత్ రెడ్డి
- తెలంగాణ నుంచి నాలుగు వేల మంది నాయకులు, కార్యకర్తలు రాక
- రైతులు, నిరుద్యోగ సమస్యలపై పోరుబాటు
- వ్యవస్థలను ప్రధాని మోదీ నాశనం చేశారు
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాటు పడుతున్నట్లు సీనియర్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగ సమస్యలపై గళమెత్తేందుకే 'భారత్ బచావో' ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి నాలుగు వేల మంది నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి వచ్చారని అన్నారు. ప్రజలకు అండగా నిలిచేందుకే ఈ కార్యక్రమం అన్నారు.
రైతులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో అన్ని విభాగాలు నిర్వీర్యమయ్యాయని, విభజించు పాలించు సూత్రంలో ప్రధాని మోదీ వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు.
నోట్ల రద్దు వికటించిందని, ఆర్థిక పరిస్థితులు దిగజారాయని, శాంతిభద్రతలు కరవయ్యాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సమస్యలపై ప్రధానిని కలిసేందుకు ప్రయత్నిస్తే కనీసం ఎంపీలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఆయన పాలన ఎంత సేపూ విదేశీ పర్యటనలకే పరిమితమయ్యిందన్నారు.
ఇక కేసీఆర్ నియంతృత్వ పాలనలో రాష్ట్రం బందీ అయ్యిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ దోపిడీ ఆపేస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బకాయిల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.