Vasireddy Padma: బాలికపై అత్యాచార ఘటనలో దిశ చట్టాన్ని అమలు చేస్తాం: వాసిరెడ్డి పద్మ
- ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు
- ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
- నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలుంటాయని వ్యాఖ్య
గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాలికను వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడటం దారుణమని చెప్పారు. ఈ ఘటనలో దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. నేరాలకు పాల్పడాలంటేనే భయం పుట్టేలా చట్టాలను అమలు చేయబోతున్నామని చెప్పారు.
మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. దిశ చట్టంపై గ్రామ స్థాయిలో చర్చ జరగాలని... ఈ చట్టాన్ని ప్రజల్లోకి మహిళా కమిషన్ తీసుకెళ్తుందని చెప్పారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని... నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.