Rahul Gandhi: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు.. రాహుల్ గాంధీ: భారత్ బచావో ర్యాలీలో రాహుల్ కీలక వ్యాఖ్యలు
- 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్నారు
- నిన్న పార్లమెంటులో బీజేపీ ఈ విషయంపై డిమాండ్ చేసింది
- చెప్పిన నిజాలపై నేను ఎన్నడూ క్షమాపణలు కోరను
- మోదీ వల్ల దేశం చాలా నష్టపోతోంది
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. 'రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది. చెప్పిన నిజాలపై నేను ఎన్నడూ క్షమాపణలు కోరను. నా పేరు రాహుల్ సావర్కర్ కాదు.. నా పేరు రాహుల్ గాంధీ' అని వ్యాఖ్యానించారు.
'మోదీ వల్ల దేశం చాలా నష్టపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. కిలో ఉల్లి ధర రూ.200కు చేరింది. నల్లధనం నిర్మూలన పేరిట అందరి జేబుల్లోని డబ్బులను మోదీ తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా నష్టపోయాం. నేడు జీడీపీ వృద్ధి రేటు 4 శాతంగా ఉంది. బీజేపీ తీసుకుంటోన్న చర్యలు ఏ మాత్రం ఫలించట్లేదు. దేశంలో మోదీ అశాంతికి కారణమవుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.