Sachin Tendulkar: నెటిజన్లూ... ఆ వెయిటర్ ఎక్కడున్నాడో కాస్త చెప్పగలరా?: సచిన్ టెండూల్కర్

  • గతంలో చెన్నై తాజ్ కోరమాండల్ హోటల్ లో సచిన్ బస
  • కాఫీ తెచ్చిన వెయిటర్ సచిన్ మోచేతి తొడుగుపై సూచన
  • వెయిటర్ సూచన పాటించి మెరుగైన ఫలితాలు అందుకున్న సచిన్

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఓ ఆసక్తికర వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతంలో తాను ఓ టెస్ట్ మ్యాచ్ కోసం చెన్నై వెళ్లినప్పుడు అక్కడి తాజ్ కోరమాండల్ హోటల్ రూమ్ లో ఉండగా, వెయిటర్ ను కాఫీ తీసుకురమ్మన్నానంటూ చెప్పడం మొదలుపెట్టారు.

"ఆ వెయిటర్ కాఫీ తీసుకుని నేనుంటున్న రూమ్ లోకి వచ్చాడు. సచిన్, మీతో క్రికెట్ గురించి మాట్లాడొచ్చా? అని అడిగాడు. ఓహ్, ష్యూర్ అని జవాబిచ్చాను. దాంతో అతడు ఇలా చెప్పాడు.... మీరు మోచేతికి ఆర్మ్ ప్యాడ్ కట్టుకున్న ప్రతిసారి మీరు బ్యాట్ ఊపే విధానంలో స్వల్పంగా మార్పు వస్తోంది. అది మీ బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తోంది అన్నాడు. నాతో అప్పటివరకు ఆ అంశం గురించి మాట్లాడినవాళ్లే లేరు. కానీ ఆ వెయిటర్ ఎంతో నిశితంగా గమనించి ఆ సూచన చేశాడని అర్థమైంది.

అతని గురించి తెలిసిందేంటంటే తను నాకు వీరాభిమాని. ఒక్కో బంతిని ఐదారుసార్లు రీప్లే చేసి చూసేంత అభిమానం ఉంది. ఆ వెయిటర్ చెప్పిన విషయం నాకు నిజమేననిపించింది. వెంటనే ఆ ఆర్మ్ ప్యాడ్ ను నా మోచేతి సైజుకు అనుగుణంగా రీడిజైన్ చేయించాను. ఎంతమేర ప్యాడింగ్ ఉండాలి? ఎక్కడ స్ట్రాప్స్ ఉండాలి? ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పి కొత్త ఆర్మ్ ప్యాడ్ ను తయారుచేయించాను. ఆ సరికొత్త ఆర్మ్ ప్యాడ్ ధరించిన తర్వాత నా బ్యాటింగ్ లో మెరుగైన మార్పు వచ్చింది. ఇప్పుడా వెయిటర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలనిపిస్తోంది. నెటిజన్లూ... ఆ వెయిటర్ ఎక్కడున్నాడో కాస్త చెప్పగలరా?" అంటూ సచిన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News