Telangana: తెలంగాణలో బైక్ షోరూం యజమానులకు తలనొప్పిగా మారిన కొత్త నిబంధన!
- నెంబర్ ప్లేట్లు వేయించే బాధ్యత షోరూంలకు అప్పగింత
- జీవో నెం.24లో పేర్కొన్న రవాణాశాఖ
- ఇదెక్కడి నిబంధన అంటున్న షోరూం యజమానులు!
గతంలో వాహనాల రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ల ఏర్పాటు రవాణా శాఖ బాధ్యతల్లో భాగంగా ఉండేవి. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ల బాధ్యతను కూడా వాహనాలు విక్రయించే షోరూం నిర్వాహకులకే అప్పగించడం తెలిసిందే. తెలంగాణలో మోటార్ వెహికిల్ చట్టంలో ఈ మేరకు మార్పులు చేశారు. అంతేకాదు, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మూడ్రోజుల్లోనే వాహనాలకు నెంబర్ ప్లేట్లు వేయాలని రవాణా శాఖ కొత్త కండిషన్ తీసుకువచ్చింది. లేకపోతే భారీ జరిమానా తప్పదని షోరూం యజమానులను హెచ్చరించింది.
కస్టమర్ బైకు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత షోరూం నిర్వాహకులదేనని, ఆ తర్వాత మూడ్రోజుల్లోనే బండికి నెంబర్ ప్లేట్ వేయించాలని అధికారులు స్పష్టం చేశారు. ఫలానా షోరూం విక్రయించిన వాహనం నెంబర్ ప్లేట్ లేకుండా పట్టుబడితే హెచ్చరికతో సరిపెడతామని, కానీ అదే షోరూం వాహనం రెండోసారి పట్టుబడితే రూ.2 లక్షల ఫైన్, మూడోసారి పట్టుబడితే రూ.5 లక్షల ఫైన్ విధిస్తామని తెలిపారు. ఇక, నాలుగోసారి పట్టుబడితే షోరూం యజమానికి జైలుశిక్ష తప్పదని తెలిపారు. ఈ మేరకు జీవో 24లో పేర్కొన్నారు.
దీనిపై షోరూం నిర్వాహకులు స్పందిస్తూ, నెంబర్ ప్లేట్ వేయించుకోవడంలో బైకు సొంతదారును బాధ్యుడ్ని చేయాలి కానీ, తమను బలి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జైలుకు పంపేంత నేరమా ఇది? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే తాము వ్యాపారాలు చేయలేమని వాపోతున్నారు.