Manipur CM brother Kidnapped: కోల్ కతాలో మణిపూర్ సీఎం సోదరుడి కిడ్నాప్.. వెంటనే పట్టేసిన పోలీసులు!
- కోల్ కతాలో నివాసముంటున్న సీఎం సోదరుడు లుఖోయి సింగ్
- రూ.15లక్షలు ఇవ్వాలంటూ ఆయన భార్యకు కిడ్నాపర్ల ఫోన్
- ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు
సీబీఐ అధికారులమని చెప్పి మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సోదరుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతం కోల్ కతాలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పశ్చిమ బెంగాల్ పోలీసులు కొన్ని గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఎం బీరెన్ సింగ్ సోదరుడు తోంగ్ బ్రమ్ లుఖోయి సింగ్ తన కుటుంబంతో కలిసి కోల్ కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో నివాసముంటున్నారు. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమని తాము సీబీఐ అధికారులమని చెప్పుకుంటూ.. లుఖోయి, అతని అనుచరుడిని వెంట తీసుకుపోయారు.
తర్వాత కిడ్నాపర్లు లుఖోయి భార్యకు ఫోన్ చేసి రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో లుఖోయి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. కిడ్నాపర్లను అరెస్టు చేసి లుఖోయి, అతని అనుచరుడిని కాపాడారు.
కిడ్నాపింగ్ కు పాల్పడిన వారిలో ఇద్దరు కోల్ కతాకు చెందినవారుండగా, ఇద్దరు మణిపూర్, మరో వ్యక్తి పంజాబ్ కు చెందిన వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. మణిపూర్ కు చెందిన ఓ వ్యక్తే వీరిని కిడ్నాప్ చేయించినట్లు సమాచారం. నిందితుల నుంచి రెండు వాహనాలు, మూడు బొమ్మ తుపాకులు, నగదును స్వాధీనం చేసుకున్నారు.