Sankranti: సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేదెలా?... బస్సులు ఫుల్, రైళ్లలో 200 దాటిన వెయిటింగ్ లిస్ట్!
- జనవరి 10 నుంచి 15 వరకూ బస్ రిజర్వేషన్లు ఫుల్
- వెయిటింగ్ లిస్ట్ పరిమితిని దాటి రిజర్వేషన్లు
- ప్రత్యేక బస్సులను నడిపిస్తామంటున్న అధికారులు
హైదరాబాద్ నుంచి సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లాలని భావించే వారికి అప్పుడే కష్టాలు మొదలైపోయాయి. జనవరిలో 10 నుంచి 13వ తేదీ వరకూ నాలుగు రోజుల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే చార్మినార్, సింహపురి, శబరి, రాయలసీమ, గోల్కొండ, గోదావరి, నాగావళి, గౌతమి, విశాఖ, గరీబ్ రథ్, జన్మభూమి, కోణార్క్, ఫలక్ నుమా వంటి ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ జాబితా 200కు పైగా పెరిగిపోగా, మరికొన్నింటిలో టికెట్లనే జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జాబితా పరిమితి కూడా మించిపోయినా, ఇంతవరకూ దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు స్పెషల్ రైళ్లను ప్రకటించలేదు.
ఇక బస్సుల విషయానికి వస్తే, నెల రోజుల ముందుగా రిజర్వేషన్ చేయించుకోవచ్చన్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి అటు ఏపీఎస్ఆర్టీసీ, ఇటు టీఎస్ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్లు జనవరి రెండో వారంలో ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే ముగిసిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, భద్రాచలం, కాకినాడ, తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో వెయిటింగ్ లిస్ట్ పరిమితిని దాటి టికెట్లు బుక్ అయ్యాయి. విజయవాడకు వెళ్లే కొన్ని సర్వీసులు, పగటి పూట నడిచే బస్సుల్లోనే అరకొర సీట్లు కనిపిస్తున్న పరిస్థితి.
రెగ్యులర్ బస్సుల్లో సీట్లు అయిపోయినట్టు చెబుతున్న అధికారులు, ఇప్పటికే పలు రూట్లలో ప్రత్యేక బస్సుల బుకింగ్ ను ప్రారంభించామని తెలిపారు. వీటిల్లో 50 శాతం అదనపు చార్జీ చెల్లించాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. 2018లో టీఎస్ఆర్టీసీ అధికారులు, సంక్రాంతి సీజన్ లో 4,500 వరకూ ప్రత్యేక బస్సులను నడిపించారు. ఈ సంవత్సరం 5 వేల బస్సులను నడపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో 1,500 వరకూ ఆంధ్రప్రదేశ్ కు ఉంటాయి. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ కూడా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడిపించనుంది.