nirbhaya: నిర్భయ దోషులను నేనే ఉరి తీస్తా.. రక్తంతో లేఖ రాసి పట్టుకొచ్చిన వర్తికా సింగ్
- లక్నోలో మీడియాకు లేఖను చూపిన వర్తికా
- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ
- మహిళే ఉరి తీయాలని డిమాండ్
దేశ వ్యాప్తంగా సంచలనమైన 'నిర్భయ' కేసులో దోషులను త్వరలోనే ఉరి తీయనున్నారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దోషులను ఓ మహిళే ఉరితీయాలని అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్ కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు తన రక్తంతో లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆమె ఈ లేఖను మీడియాకు చూపారు.
నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న నలుగురి ఉరిశిక్షను మహిళతోనే అమలు జరిపించాల్సిందిగా వర్తికా సింగ్ పేర్కొన్నారు. లేదంటే ఉరితీతకు తలారీగా తనను నియమించాలని ఆమె ఆ లేఖలో కోరారు. దీని ద్వారా ఇటువంటి శిక్షలు మహిళ కూడా వేయగలదన్న సందేశాన్ని కూడా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. మహిళా నటులు, ఎంపీలు కూడా తనకు మద్దతు తెలపాలని ఆమె కోరారు. ఈ చర్యతో సమాజంలో మార్పు వస్తుందన్న ఆశిస్తున్నట్లు తెలిపారు.