SP Balu: అవార్డులు వస్తేనే గుర్తింపు వచ్చినట్టు కాదు: గొల్లపూడిపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు

  • అనారోగ్యంతో కన్నుమూసిన గొల్లపూడి
  • నివాళులు అర్పించిన ఎస్పీ బాలు
  • తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం అంటూ కితాబు

సుప్రసిద్ధ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గొల్లపూడికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం బాలు మీడియాతో మాట్లాడుతూ, అవార్డులు వస్తేనే గుర్తింపు లభించినట్టుగా భావించాల్సిన అవసరంలేదని, గొల్లపూడికి అంతకంటే ఎక్కువగా తెలుగు సినిమా గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. నిలువెత్తు తెలుగుదనం అంటే గొల్లపూడి పేరే చెప్పుకోవాలని అన్నారు.  

సినీ రంగంలో ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, భాష పరంగా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. ఆయనకు తాను ఆత్మబంధువునని అంతకంటే ఎక్కువ చెప్పలేనని భావోద్వేగాలకు లోనయ్యారు. తెలుగులో తాను ఒక్కటే సినిమా తీశానని, అది శుభసంకల్పం సినిమా అని, ఆ సినిమాకు స్క్రిప్టు రాసింది గొల్లపూడేనని బాలు వెల్లడించారు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా పత్రికల్లో జీవన కాలమ్ పేరుతో గొల్లపూడి ఆర్టికల్ రాసేవారని, గొల్లపూడి గొప్ప మేధావి అని కీర్తించారు.

కాగా, చెన్నై టీ నగర్ లోని శారదాంబాళ్ స్ట్రీట్ లో ఉన్న గొల్లపూడి నివాసానికి నిన్నటి నుంచి ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన గొల్లపూడికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విదేశాల నుంచి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు రావాల్సి ఉండడంతో అంత్యక్రియలు ఆలస్యం అయ్యాయి.

  • Loading...

More Telugu News