Siddipet District: ఊరికి కాపలాగా ఉన్న కొండముచ్చు మృతి.. గ్రామస్థుల కన్నీరు!
- కోతుల బెడద నుంచి కాపాడిన కొండముచ్చు
- అస్వస్థతతో మృతి
- సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
కోతుల బెడద నుంచి తమను రక్షిస్తూ గ్రామానికి కాపలాగా ఉన్న కొండముచ్చు మృతితో సిద్దిపేట జిల్లా నర్సాపూర్ గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఊరు ఊరంతా విచారంలో మునిగిపోయింది. గ్రామంలో కోతుల బెడద ఎక్కువైపోయి కంటిమీద కునుకు లేకుండా చేస్తుండడంతో రాజమండ్రి నుంచి రెండు కొండముచ్చులను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వాటిని గ్రామంలోని అన్ని ప్రదేశాల్లో తిప్పడంతో కోతులు భయపడి ఊళ్లోకి రావడం మానేశాయి.
ఇటీవల ఓ కొండముచ్చు అస్వస్థతకు గురైంది. దీంతో దానికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అది మృతి చెందడంతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. దానికి సంప్రదాయబద్ధంగా డప్పుచప్పుళ్ల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కోతుల నుంచి తమకు రక్షణగా నిలిచిన కొండముచ్చుకు గుర్తుగా గ్రామంలో దాని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గ్రామస్థులు తెలిపారు.