Reverse Tendering: రివర్స్ టెండరింగ్ పై అట్టుడుకుతున్న ఏపీ అసెంబ్లీ
- రివర్స్ టెండరింగ్ పై టీడీపీ వాయిదా తీర్మానం
- ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేదన్న రామానాయుడు
- లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ నాటి సమావేశాలు రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రివర్స్ టెండరింగ్ పై టీడీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. మరోవైపు రివర్స్ టెండరింగ్ పై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, 80 శాతం పూర్తైన ఇళ్ల నిర్మాణాలను కూడా ఆపేశారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరితో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 3 వేల చొప్పున అద్దె చెల్లించాలని కోరారు. రివర్స్ టెండరింగ్ పేరుతో హైదరాబాదుకు చెందిన చిన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.