kishan reddy: కొన్ని పార్టీలు హింసాత్మక ఘటనలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నాయి: కిషన్ రెడ్డి ఫైర్
- శాంతియుతంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఎవరికైనా ఉంది
- హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు
- ప్రజలను ఇబ్బందులకు గురి చేసే హక్కు ఎవరికీ లేదు
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో కొనసాగుతోన్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాంతియుతమైన పద్ధతిలో అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఎవరికైనా ఉందని అన్నారు. అయితే, కొందరు బస్సులను, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు.
కొన్ని పార్టీలు హింసాత్మక ఘటనలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నాయని, ఈ పద్ధతి సరికాదని కిషన్ రెడ్డి విమర్శించారు. కొన్ని సంస్థలు ఆందోళనలతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు. కాగా, జేఎంఐ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.