IIT: పౌరసత్వ చట్టంపై నిరసన బాటలో ఐఐటీ విద్యార్థులు!
- ఇటీవలే పౌరసత్వ చట్టానికి సవరణ చేసిన కేంద్రం
- దేశవ్యాప్తంగా నిరసనలు
- భగ్గుమంటున్న విద్యార్థి లోకం
కేంద్రం పౌరసత్వ చట్టానికి సవరణ చేయడం పట్ల దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో భగ్గుమన్న మంటలు క్రమంగా ఢిల్లీకి పాకాయి. ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీ విద్యార్థుల ఆందోళనలు హింసాత్మక రూపుదాల్చాయి. ఈ నేపథ్యంలో, తమపై ఉన్న అపప్రధను తొలగించుకునేందుకు ఐఐటీ విద్యార్థులు కూడా నిరసన గళం వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఐఐటీలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ధర్నాలు, నిరసనలు నిర్వహించిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బాంబే , ఐఐటీ మద్రాస్ లకు చెందిన విద్యార్థులు జామియా, అలీగఢ్ వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ప్రదర్శనలు చేపట్టారు.
"జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై ప్రతీకారదాడి జరిగినప్పుడూ స్పందించలేదు, ఎంటెక్ ఫీజులు పెంచినప్పుడూ స్పందించలేదు, జేఎన్ యూ విద్యార్థులపై దాడి జరిగినప్పుడూ స్పందించలేదు, ఇప్పుడు కూడా స్పందించకపోతే విద్యార్థి లోకం పట్ల మన నిబద్ధత ప్రశ్నార్థకంగా మారుతుంది" అంటూ ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు ఓ పోస్టర్ లో నినదించారు. ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ఐఐటీలకు చెందిన విద్యార్థులు కూడా నిరసనలకు దిగడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.