APSRTC: ఏపీ ఎస్సార్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం
- ఇకపై 52 వేల మంది కార్మికులూ ప్రభుత్వ ఉద్యోగులే
- జనవరి ఒకటిన అధికారికంగా విలీనం
- చంద్రబాబు హయాంలో ఆర్టీసీని పట్టించుకోలేదు: జగన్
ఏపీ ఎస్సార్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును మంత్రి పేర్ని నాని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం, ఈ బిల్లును సభ ఆమోదించినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అంతకుముందు, సీఎం జగన్ మాట్లాడుతూ, జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నట్టు వెల్లడించారు.
ఇకపై 52 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు, టీడీపీ నేతలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారని, ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చారని, 1997లో తీసుకొచ్చిన ఈ చట్టం అడ్డంకిగా మారిందని, అందుకే ఈరోజున చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని చెప్పారు.