Uttar Pradesh: కోర్టు హాలులో నిందితుడి కాల్చివేత... బల్ల కింద దాక్కున్న న్యాయమూర్తి
- ఉత్తరప్రదేశ్ లో అరాచకం
- కోర్టులో కాల్పులు
- నిందితుడు మృతి
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల ఎంత అరాచక పరిస్థితులు నెలకొన్నాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. కోర్టు ప్రాంగణంలో జడ్జి చూస్తుండగానే దుండగులు నిందితుడ్ని కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నూర్ జిల్లా న్యాయస్థానం ఇందుకు వేదికగా నిలిచింది. దుండగులు కాల్పులు జరపడంతో జడ్జి సహా, న్యాయవాదులు, ఇతర సిబ్బంది బల్లల కింద దాక్కున్నారు.
గత వేసవిలో నజీబాబాద్ బీఎస్పీ ఇన్ చార్జి హాజీ హాసన్ ను, అతడి మేనల్లుడ్ని కాల్చి చంపారు. నిందితులను బిజ్ నూర్ కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకురాగా, హాలులో విచారణ జరుగుతుండగా, హాజీ హసన్ కుమారుడు, మరో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో షానవాజ్ అనే ప్రధాన నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సందర్భంగా కోర్టులో భీతావహ వాతావరణం నెలకొంది. ఎవరు ఎవర్ని చంపుతున్నారో అర్థంకాకపోవడంతో జడ్జి, న్యాయవాదులు తమ బల్లలనే రక్షణ కవచాలుగా చేసుకుని ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో కాల్పులు జరిపిన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.