Telugudesam: టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాల్సి రావడం దురదృష్టకరం: స్పీకర్ తమ్మినేని
- వారం రోజులుగా సమావేశాల తీరును గమనిస్తున్నాం
- ప్రతి చిన్న విషయానికి పోడియం వద్దకు ప్రతిపక్ష సభ్యులు వస్తున్నారు
- ఈ వారం రోజుల్లో వారు గౌరవంగా వ్యవహరించిన దాఖలాలు లేవు
ఏపీ టీడీపీ సభ్యులు తొమ్మిది మందిని సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్ చేయడానికి గల కారణాలను స్పీకర్ తమ్మినేని సీతారాం వివరించారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయలేదని అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, గడచిన వారం రోజులుగా శాసనసభా సమావేశాల తీరును గమనిస్తున్నామని, ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గరకు వస్తూ ప్రతిపక్ష సభ్యులు గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు.
ఈ సభ్యులు చేస్తున్న గందరగోళాన్ని భరిస్తూనే ముఖ్యమంత్రి, మంత్రులు, మిగిలిన శాసనసభ్యులు ఎంతో హుందాగా వ్యవహరించారని చెప్పారు. గౌరవ సభ్యులను సస్పెండ్ చేయాల్సి రావడం సభా నాయకుడు, మంత్రులు, సభ్యులకు, తనకు గానీ ఎవరికీ ఇష్టం లేదని అన్నారు. సస్పెండ్ అయిన సభ్యులు ఈ వారం రోజుల్లో గౌరవంగా వ్యవహరించిన దాఖలాలు లేవని, ప్రతి చిన్న విషయాన్నీ కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనా ధోరణితో చూడటం సబబు కాదని అన్నారు.
ఈరోజున రాజధాని అంశంపై జరిగిన చర్చ విషయమై మాట్లాడేందుకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు, వారి సభ్యులు మాట్లాడేందుకు సరిపడా సమయమిచ్చామని, సంబంధిత మంత్రులు వివరణలు కూడా ఇచ్చారని అన్నారు. రాజధాని అమరావతిపై చాలా మంది భ్రమలో ఉన్నారని, ఈ రోజున ఆ భ్రమను ప్రభుత్వం పటాపంచలు చేస్తూ వాస్తవాలు బయటపెట్టే పరిస్థితిలో టీడీపీ సభ్యులు ఈ విధంగా చేయడం సరికాదని అన్నారు.
'ఉద్దేశపూర్వకంగా కాదు బాధాతప్త హృదయంతో తొమ్మిది మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘నేను అయితే చాలా మనస్తాపానికి గురయ్యాను. చాలా బాధతోనే ఈ కార్యక్రమాన్ని చేయవలసి వస్తోందని సభకు తెలియజేసుకుంటున్నా’ అని తమ్మినేని పేర్కొన్నారు.