CAA Portest in Panjab: పంజాబ్ లోనూ సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు
- ఢిల్లీలోని జామియా మిలియా విద్యార్థులకు మద్దతుగా మిన్నంటిన ఆందోళనలు
- సీఏఏ చట్టం రాజ్యాంగ అధికరణ 14ను అతిక్రమిస్తోందన్న పంజాబ్ విద్యార్థి నేత
- అలీఘడ్ ముస్లిం, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ పరీక్షల వాయిదా
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వెల్లువెత్తుతున్న నిరసనలకు పంజాబ్ లోని రెండు ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు కూడా మద్దతు పలికారు. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు సీఏఏ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్రంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు దేశ నలుమూలలకు విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తోంది. వందల కొద్దీ పంజాబ్ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి జామియా మిలియా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీల విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు.
ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని పంజాబ్ యూనివర్సిటీలోని స్టూడెంట్స్ ఫర్ సొసైటీ(ఎస్ఎఫ్ఎస్) ఖండించారు. ఈ చట్టం రాజ్యాంగంలోని అధికరణ 14ను అతిక్రమిస్తోందని.. ఇది భారత్ అవలంబిస్తున్న సెక్యులర్ విధానం ఉల్లంఘనే అని ఎస్ఎఫ్ఎస్ విద్యార్థి నేత హర్మన్ అన్నారు. ఢిల్లీలో పోలీసులు బీజేపీ హిందూత్వ ఎజెండాతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హెచ్ఆర్ డీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో వెల్లువెత్తుతోన్న హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో పలు పార్టీల నేతలు రాష్ట్రపతిని కలిసి దేశంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు.