BJP: అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న సీఎం జగన్ ఆలోచనను బీజేపీ స్వాగతిస్తోంది: విష్ణువర్ధన్ రెడ్డి
- జగన్ చెప్పిన అజెండాను మాటలతో కాకుండా చేతల్లో చూపించాలి
- అమరావతి కేంద్రంగా ‘సీడ్ క్యాపిటల్’ ఉండాలి
- మూడు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుంది
ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమోనని సీఎం జగన్ సూచనప్రాయంగా చేసిన ప్రకటనపై అప్పుడే స్పందనలు మొదలయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న సీఎం జగన్ ఆలోచనను బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి జగన్ చెప్పిన అజెండాను మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తే కనుక తమ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తుందని అన్నారు. అదే సమయంలో, అమరావతి కేంద్రంగా సీడ్ క్యాపిటల్ ను నిర్వీర్యం చేయకూడదని, అమరావతిని అభివృద్ధి చేయాలన్న గత ప్రభుత్వ ఆకాంక్షను నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు.
అమరావతిలో పదివేల ఎకరాల్లో ‘సీడ్ క్యాపిటల్’ను ఏర్పాటు చేయాలని కోరారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో పాటు మిగతా అంశాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రానికి గతంలో లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. నాడు చంద్రబాబునాయుడు తమ మాట వినలేదని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయలేదని అన్నారు.