devineni: సీఎం, మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారు: దేవినేని ఉమ
- గత ప్రభుత్వ హయాంలో వైసీపీ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంది
- అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు
- విశాఖ చుట్టుపక్కలా వైసీపీ నాయకులు భూములు కొనుగోలు చేశారు
- వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలి
రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జగన్ నిన్న సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో దీనిపై ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ... సీఎం, మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కేసులు వేసి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుందని దేవినేని ఉమ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఐదు వేల మంది రైతులకు ఇళ్ల నిర్మాణాలను గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని, 13 జిల్లాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుందని చెప్పారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవని అన్నారు. అయితే, విశాఖ చుట్టుపక్కల వైసీపీ నాయకులు ఆరు వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.