New Delhi: పోలీసులు ఆత్మరక్షణ కోసం విద్యార్థులపై లాఠీచార్జి చేస్తే తప్పుకాదు: గంభీర్
- పౌరసత్వ చట్టంపై నిరసన జ్వాలలు
- అట్టుడుకుతున్న ఢిల్లీ విద్యార్థి లోకం
- స్పందించిన గంభీర్
పౌరసత్వం సవరణ చట్టం కారణంగా ఢిల్లీలో విద్యార్థి లోకం నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో పోలీసులు ఓ వర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీలు ఝుళిపించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం లాఠీచార్జి చేస్తే అందులో తప్పుబట్టాల్సిందేమీ లేదని అన్నారు. తమపై రాళ్లు విసురుతున్నప్పుడు, ప్రజల ఆస్తులను దహనం చేస్తూ హింసకు పాల్పడుతున్నప్పుడు ఆందోళనకారులను పోలీసులు ప్రతిఘటిస్తారని అభిప్రాయపడ్డారు. కేవలం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేస్తే అది తప్పేనని గంభీర్ స్పష్టం చేశారు. హింసకు తావులేని రీతిలో నిరసన చేపడితే ఎవరికీ సమస్య ఉండదని అన్నారు.