UP Assembly: యూపీ అసెంబ్లీలో విచిత్రం.. ప్రతిపక్షంతో కలిసి అధికార బీజేపీ సభ్యుల నిరసన
- పోలీసులు వేధిస్తున్నారంటూ.. బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ ప్రసంగం
- గుర్జర్ ప్రసంగాన్ని అడ్డుకున్న స్పీకర్
- దీంతో గుర్జర్ సహా కొంతమంది బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల అందోళన
యూపీ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్రం జరిగింది. ప్రతిపక్షంతో కలిసి అధికార పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే, బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జర్ సభలో మాట్లాడుతూ.. తనను పోలీసులు వేధిస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలను తెలుపబోయేసరికి స్పీకర్ ఆయన్ని వారించారు. ఈ నేపథ్యంలో గుర్జర్ తనకు మైక్ ఇమ్మని డిమాండ్ చేయగా స్పీకర్ అడ్డుకున్న నేపథ్యంలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు గుర్జర్ కు బాసటగా నిలిచారు.
వీరంతా కలిసి స్పీకర్ వైఖరిని తప్పుబడుతూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అయినప్పటికీ, సుమారు 100మంది బీజేపీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభను వీడకుండా తమ నిరసనను వ్యక్తం చేశారు. నాలుగు గంటలపాటు ఈ డ్రామా కొనసాగింది. కొందరు సీనియర్ మంత్రులు, స్పీకర్ కలుగజేసుకుని ఆందోళన విరమించేలా చేయడంతో సభలో ప్రశాంత పరిస్థితి నెలకొంది. మరోవైపు ఓ బీజేపీ ఎమ్మెల్యే ఈ పరిస్థితిపై తన నిరసన వెళ్లగక్కుతూ... ఎమ్మెల్యేల పరిస్థితి దిగజారింది. ఎమ్మెల్యేలకు కూడా ఓ సంఘం ఉండాలి.. వారి హక్కులను కాపాడుకునేందుకు యూనియన్లు ఉంటే తప్పేంటి? అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.