ports construction In Andhraparadesh: మే, జూన్ నాటికీ రెండు పోర్టులకు శంకుస్థాపన: సీఎం జగన్
- రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష
- తొలి దశలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పూర్తికి ఆదేశం
- పోర్టుల నిర్మాణ స్థలాల్లో వెంటనే భూసేకరణ ప్రారంభించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమలశాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. దుగరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల ప్రణాళికల తయారీకి ఆదేశించారు. తొలి దశలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు పూర్తిచేయాలన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఇప్పటికే భూమి అందుబాటులో ఉందన్న సీఎం, వీలైనంత వేగంగా ఈ పోర్టును నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన పోర్టుల నిర్మాణ స్థలాల్లో వెంటనే భూమి సేకరించాలని చెప్పారు.
కాగా, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్ కల్లా ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం స్పందిస్తూ.. మే, జూన్ నాటికి రెండు పోర్టులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం, కేంద్రం నిధులు ఇస్తామని చెప్పిందంటూ.. ఆ మేరకు కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.