Visakha onday intl.: విశాఖ వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ హ్యాట్రిక్!
- 33వ ఓవర్లో వరుసగా ముగ్గురిని ఔట్ చేసిన కుల్దీప్
- కెరియర్లో రెండో హ్యాట్రిక్ సాధించిన స్పిన్నర్
- తొలిసారిగా ఆసీస్ పై హ్యాట్రిక్ సాధించిన కుల్దీప్
విశాఖ వేదికగా ఉత్కంఠగా వెస్టిండీస్ తో సాగుతున్న రెండో వన్డేలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతం చేశాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించడమే కాక భారత్ విజయం సాధించే అవకాశాలను మెరుగుపర్చాడు. భారత్ నిర్దేశించిన 387 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 33.3 ఓవర్ల వద్ద 210 పరుగుల వద్ద ఉన్నప్పుడు వరుసగా మూడు వికెట్లు పోగొట్టుకుంది.
33వ ఓవర్ వేసిన కుల్దీప్ ఓవర్ నాలుగో బంతికి భారత బౌలర్లకు పరీక్ష పెడుతున్న షాయ్ హోప్ 78 పరుగులు (85బంతులు, ఫోర్లు-7 సిక్స్ లు-3) ను అవుట్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతిని సిక్సర్ గా మలచబోయిన హోప్ బౌండరీ లైన్ వద్ద కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో హోప్ పెవిలియన్ చేరాడు. మరుసటి బంతికి హోల్డర్ 11 పరుగులు (13బంతులు, ఒక సిక్స్), స్టంప్ అవుట్ చేశాడు. ఓవర్ చివరి బంతికి అల్జారీ జోసెప్ డకౌటయ్యాడు. వన్డేల్లో కుల్దీప్ హ్యాట్రిక్ చేయడం ఇది రెండో సారి. గతంలో 2017లో ఆస్ట్రేలియాపై కుల్దీప్ తొలిసారిగా హ్యాట్రిక్ సాధించాడు.
వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్లు
1987లో చేతన్ శర్మ న్యూజిలాండ్ పై
1991లో కపిల్ దేవ్ శ్రీలంకపై
2017లో కుల్దీప్ ఆస్ట్రేలియాపై
2019లో మహ్మద్ షమీ ఆఫ్ఘానిస్తాన్ పై
2019లో కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ పై