Air Hostess: ఉరి వేసుకుని ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య.. పీజీ ఓనర్ పై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి
- మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ఎయిర్ హోస్టెస్
- ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నానని తనతో చెప్పిందన్న తండ్రి
- సూసైడ్ నోట్ లభించలేదన్న పోలీసులు
ఓ ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న మిస్తు సర్కార్ అనే ఎయిర్ హోస్టెస్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్ గావ్ లోని డీఎల్ఎఫ్ ఫేజ్-3లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న ఆమె... గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని, విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. ఆమె స్వస్థలం పశ్చిమబెంగాల్ లోని సిలిగురి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే, తన కూతురు ఉంటున్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్ యజమానే ఆమె మరణానికి కారణమని... ఆయన అసభ్యకర తీరుతోనే ఈ ఘోరం సంభవించిందని ఆమె తండ్రి ఆరోపించారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో తన కూతురు తనకి ఫోన్ చేసిందని... పేయింగ్ గెస్ట్ అకామడేషన్ ఓనర్ తనను హింసిస్తున్నాడని ఆ సందర్భంగా తనతో చెప్పిందని ఆయన తెలిపారు.
తాను రూముకు తిరిగి వచ్చిన సమయంలో తనను కించపరుస్తూ మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పారు. తన ఫోన్ ను అతను హ్యాక్ చేశాడని, ఎక్కడికీ వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని ఏడుస్తూ చెప్పిందని తెలిపారు. ఓనర్ హింసను భరించలేకపోతున్నానని... సిలిగురికి తిరిగి వచ్చేస్తానని తనకు చెప్పిందని... ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్నానని చెప్పారు.
కాసేపటి తర్వాత పీజీ ఓనర్ తనకు ఫోన్ చేసి మిస్తు తప్పు చేసిందని చెప్పాడని.. ఏం జరిగిందని తాను అడిగితే... అతను సమాధానం ఇవ్వలేదని మృతురాలి తండ్రి తెలిపారు. వెంటనే తాను గుర్ గావ్ పోలీసులకు ఫోన్ చేసి, ఏం జరిగిందో చూడాలని కోరానని చెప్పారు. అక్కడకు వెళ్లిన పోలీసులకు... ఫ్యాన్ కు వేలాడుతూ తన కుమార్తె కనిపించిందని తెలిపారు. పీజీ ఓనరే ఏదైనా చేసి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తనతో తన కూతురు ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో... ఆమె ఆత్మహత్యకు పాల్పడబోతున్నట్టు ఎక్కడా అనిపించలేదని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, తమకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిని పరిశీలించారని, అవసరమైన ఆధారాలను సేకరించారని తెలిపారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశామని చెప్పారు.