chillis: మిరపకాయలు తింటే గుండె పోటు ముప్పు తగ్గుతుంది: ఇటలీ పరిశోధకులు
- ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’ జర్నల్‌లో వివరాలు
- మిరపకాయలు తింటే గుండెపోటు ముప్పు 40 శాతం తగ్గుదల
- దాదాపు 23 వేల మందిపై పరిశోధనలు
మిరపకాయల్లో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గించే ‘క్యాప్సేసియన్’ అనే పదార్థం ఉంటుందని దీని వల్ల గుండెకు రక్షణ కలుగుతోందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలోజీ’ జర్నల్‌లో ప్రచురించారు. భోజనంలో భాగంగా వారానికి నాలుగుసార్లు మిరప కాయలు తింటే గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని చెప్పారు.
దాదాపు 23 వేల మందిపై పరిశోధనలు చేసి ఈ వివరాలను వెల్లడించారు. వీరంతా మెడిటెరేనియన్ డైట్‌ను అధికంగా తీసుకొనే మొలిస్ ప్రాంతానికి చెందిన ప్రజలని పరిశోధకులు చెప్పారు. వారి ఆహార అలవాట్లను ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు. ఈ కాలంలో 1,236 మంది మృతి చెందారని, వారిలో కేన్సర్, గుండెపోటు కారణంగా మూడొంతుల మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు.
మృతి చెందిన వారి వయస్సుతో పాటు వారి ఆహారపు అలవాట్లను పరిశోధకులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఫలితంగా వారానికి నాలుగుసార్లు ఆహారంలో మిరపకాయలను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉందని వారు గుర్తించారు.