gurukulam: గురుకులాల్లో స్వలింగ వేధింపులు... అబ్బాయిలే బాధితులు!
- వెలుగుచూస్తున్న తాజా వాస్తవాలు
- ఇప్పటి వరకు అమ్మాయిలకే ఇబ్బందులు
- ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాల్లో అనైతిక కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు గురుకులాల్లో చదువుతున్న బాలికలకే లైంగిక వేధింపులు పరిమితం అనుకుంటే బాలురు కూడా ఆ జాబితాలో చేరుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు తమ కింది తరగతి బాలురను లైంగికంగా వేధిస్తున్నారన్న ఫిర్యాదులు అందుతుండడం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది.
ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ద్వారా గురుకులాలు నిర్వహిస్తోంది. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు ఈ గురుకులాల్లో ఉంటారు. ఒక్కో గదిలో నలభై మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు.
సెల్ ఫోన్లలో నీలి చిత్రాలు చూడడం, హార్మోన్ల ప్రభావంతో రాత్రిపూట పక్కపక్కనే పడుకునేటప్పుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నది ఆరోపణ. వెలుగు చూస్తున్న ఇటువంటి ఆరోపణలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గురుకులాల్లో చదువుతున్న పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు, లేదా తల్లిదండ్రులే పాఠశాలలను సందర్శించినప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్న పిల్లలు వారికి తమ గోడు వినిపించుకోవడంతో ఇవి వెలుగు చూస్తున్నాయి. ఫిర్యాదులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.