CAA: పౌరసత్వ సవరణ చట్టంపై మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
- ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో రెఫరెండం చేపట్టాలి
- ఓడిపోతే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలి
- సీఏఏను వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళనలు ఆపొద్దు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దమ్ముంటే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ)లపై ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాలు విసిరారు. ఈ ఓటింగ్లో కనుక బీజేపీ ఓటమిపాలైతే గద్దె దిగిపోవాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అయిన తర్వాత ఇప్పుడు భారతీయ పౌరులుగా నిరూపించుకోవాలా? అని ప్రశ్నించారు. సీఏఏను కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు నిరసనలు ఆపవద్దని పౌరులకు సీఎం సూచించారు.
నిరసనల ముసుగులో బీజేపీ కార్యకర్తలే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మమత ఆరోపించారు. ఎన్ఆర్సీ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని మమత సూచించారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ఓటర్ల జాబితా పనులు మొదలయ్యాయని, జాబితాలోని నకిలీ పేర్లను తొలగిస్తామని మమత పేర్కొన్నారు. ప్రజలందరి పేర్లూ జాబితాలో ఉంటాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.