siddaramaiah: సీఎల్పీ నేతగా కొనసాగనంటే కొనసాగనంతే: తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
- సీఎల్పీ నేతగా కొత్త వారిని నియమించాలన్న సిద్ధరామయ్య
- ఉప ఎన్నికల్లో ఓటమిపై అధిష్ఠానానికి త్వరలో నివేదిక
- సిద్ధరామయ్య, గుండూరావుల రాజీనామా ఆమోదించాలని అధిష్ఠానం నిర్ణయం
తన రాజీనామాపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య భీష్మించుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా కొనసాగబోనని తెగేసి చెప్పారు.
నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమితో తాను తీవ్ర నిరాశకు గురయ్యానన్నారు. సీఎల్పీ నేత బాధ్యతలు కొత్త వారికి అప్పగించాలని కోరారు. సీఎల్పీ పదవిలో కొనసాగడానికి తన మనసు అంగీకరించడం లేదన్నారు. పదవి లేకున్నా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతానని అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై అధిష్ఠానానికి త్వరలోనే నివేదిక ఇవ్వనున్నట్టు సిద్ధరామయ్య తెలిపారు.
కాగా, తన రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రస్తక్తి లేదని సిద్ధరామయ్య తెగేసి చెప్పడంతో ఆయన రాజీనామాను ఆమోదించాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, పార్టీ రాష్ట్ర చీఫ్ దినేశ్ గుండూరావు రాజీనామాను కూడా ఆమోదించాలని కూడా అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.