Andhra Pradesh: మూడు కాకపోతే 33 పెట్టుకుంటాం.. రాజధానులపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
- రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం
- రాజధానుల నిర్మాణానికి కేంద్రం అనుమతి అక్కర్లేదు
- మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు
మూడు రాజధానుల ప్రకటనపై సర్వత్ర వెల్లువెత్తుతున్న విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. సచివాలయం తాత్కాలికమని చంద్రబాబు నాయుడే చెప్పారని పేర్కొన్న ఆయన.. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. రాజధానిలో భూములు వెనక్కి ఇచ్చేస్తామని ఎన్నికలకు ముందే జగన్ చెప్పారని, చెప్పినట్టే రైతుల భూములను వెనక్కి ఇస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఆందోళన చేస్తున్నది టీడీపీ కార్యకర్తలు మాత్రమేనని అన్నారు.
రాజధానుల నిర్మాణానికి కేంద్ర అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్దిరెడ్డి తెలిపారు. తెలంగాణ తరహాలో ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్నారు. విశాఖలో భూములు కొన్నామని చెప్పడం అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు. అక్కడ ఇప్పటికే భూముల ధరలు పెరిగినట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో నిర్వహిస్తామని పెద్దిరెడ్డి వెల్లడించారు.