NRC: 2024 ఎన్నికలకు ముందే వారందరినీ దేశం నుంచి గెంటేస్తాం: కిషన్ రెడ్డి

  • ఎన్నార్సీపై ఎలాంటి కార్యాచరణను రూపొందించలేదు
  • దీనికి సంబంధించి లీగల్ ఫ్రేమ్ వర్క్ కూడా జరగలేదు
  • విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి

ఓ వైపు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని సహా, పలు నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో, పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు, అత్యంత కీలకమైన జాతీయ పౌర జాబితా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)పై అందర్లో ఉత్కంఠ నెలకొంది. ఈ జాబితా పార్లమెంటు ఆమోదం పొంది, చట్ట రూపం దాలిస్తే... ప్రతి ఒక్కరూ తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వారిని దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిగా పరిగణిస్తారు.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి జాతీయ పౌర జాబితాపై వివరణ ఇచ్చారు. జాతీయ పౌర జాబితా బిల్లుపై ఇంత వరకు ఎలాంటి కార్యాచరణను రూపొందించలేదని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ను రూపొందించడం కానీ, దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం కానీ జరగలేదని చెప్పారు. దీనికి సంబంధించి లీగల్ ఫ్రేమ్ వర్క్ కూడా జరగలేదని తెలిపారు. ఎన్నార్సీపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

అయితే, ఒక్క విషయాన్ని మాత్రం తాను స్పష్టంగా చెబుతున్నానని... 2024లో జరగబోయే ఎన్నికలకు ముందే అక్రమ వలసదారులందరినీ దేశం నుంచి గెంటేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

ఇటీవల అసోంలో నిర్వహించిన పౌర జాబితాలో ఏకంగా 19 లక్షల మంది ప్రజలు... కొత్త జాబితాలో లేకుండా పోయారు. దీంతో, బీజేపీ తీసుకురావాలనుకుంటున్న జాతీయ పౌర జాబితాపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ, ఆందోళన నెలకొన్నాయి.

పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి విధివిధానాలను కూడా ఇంకా రూపొందించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆందోళనలు ఆగిపోయి, ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత... పౌరసత్వ బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ ను రూపొందించే ముందు... ప్రతి ఒక్కరితో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News