Social Media: సామాజిక మాధ్యమాల్లో పుకార్లు పుట్టించే వారిపై పోలీసుల నిఘా!
- పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల నేపథ్యం
- అభ్యంతరకర పోస్టులు ఉంటే తొలగింపు
- చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసన
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతుండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో పుకార్లు సృష్టిస్తున్న వారిపై దృష్టిసారించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసనలు ఆ తర్వాత దేశ రాజధానికి పాకాయి. ప్రస్తుతం రాజధానిని నిరసనలు కుదిపేస్తున్నాయి. క్రమేపీ నిరసనలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయి.
ఇదే అదనుగా కొందరు పుకార్లు సృష్టించి ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో పోస్టు చేస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు గుర్తించిన పోలీసులు సామాజిక మాధ్యమాలపై దృష్టిపారించారు. అభ్యంతకర పోస్టులు కనిపిస్తే వాటిని తొలగిస్తున్నారు.
ఢిల్లీ ఆందోళన సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టింగులు దాదాపు 60 వరకు కనిపించాయని, వీటివల్ల హింసాకాండ మరింత పెరిగిందని తెలియజేస్తూ వాటిని తొలగించాలని నిర్వాహకులను కోరారు. అదే సమయంలో క్యాబ్ కు వ్యతిరేకంగా పుకార్లు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.