Ganta Srinivasa Rao: జగన్ ప్రకటనను నేను స్వాగతించడానికి కారణం ఇదే: గంటా శ్రీనివాసరావు
- రాజధానిగా విశాఖ అన్ని విధాలా అర్హమైనది
- విశాఖను ఆర్థిక రాజధాని చేయాలని ఎన్నోసార్లు నేను చెప్పా
- పార్టీ పరంగా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చు
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అన్ని విధాలా అర్హమైనదని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర రాజధానిగా విశాఖ వంద శాతం సరైనదనేది తన అభిప్రాయమని చెప్పారు. విశాఖపట్టణం పౌరుడిగా, ఈ నగరంతో తనకున్న అనుబంధం కారణంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను తాను స్వాగతించానని తెలిపారు. రాజధానిగా విశాఖ సరైన నగరమని తాను గతంలో ఎన్నో సార్లు చెప్పానని అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కూడా విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని తాను డిమాండ్ చేశానని చెప్పారు. అందుకే జగన్ ప్రకటన చేసిన వెంటనే దాన్ని స్వాగతిస్తూ తాను ట్వీట్ చేశానని తెలిపారు.
విశాఖ అంశంపై పార్టీ పరంగా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చని గంటా అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు... రాజధాని అక్కడే ఉండాలని తమ అధినేత చంద్రబాబు అనుకోవచ్చని, అది తమ పార్టీ స్టాండ్ కావచ్చని... అయితే విశాఖను రాజధానిగా చేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఎంతో అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా ఎవరూ కాదనలేని పరిస్థితి ఉందని... తానే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన ఇతర నేతలు ఎవరూ కూడా కాదనలేరని అన్నారు. మరోవైపు, జగన్ ప్రకటనను గంటా స్వాగతించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.