Budda Venkanna: రాజధాని ప్రకటనకి ముందే రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారు: బుద్ధా వెంకన్న
- 500 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు
- 7 నెలల కాలంలో విజయసాయి చక్కబెట్టిన వ్యవహారం ఇదే
- వైసీపీ పాలన వచ్చిన తర్వాత విశాఖ భూముల అక్రమాలపై సిట్ విచారణ జరిపించాలి
విశాఖపట్టణంలో బినామీలతో కలసి సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు 500 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో కేంద్రం వద్ద మెడలు వంచి విజయసాయిరెడ్డి చక్కబెట్టిన వ్యవహారం విశాఖలో భూములను చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇప్పుడు అదే చోట రాజధాని రాబోతోందని విమర్శించారు.
రాజధాని ప్రకటన వెలువడక ముందే రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టి భూములను అగ్రిమెంట్ చేసుకున్నారని వెంకన్న ఆరోపించారు. ఇప్పుడు రాజధాని ప్రకటన వచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్లు మొదలుపెడతారని అన్నారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే జగన్ పాలన వచ్చిన తర్వాత విశాఖలో చోటుచేసుకున్న భూముల అక్రమాలపై సిట్ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.