Mamata Banerjee: నేను రెఫరెండం అని అనలేదు.. ఓటింగ్ అని మాత్రమే అన్నా: మమతా బెనర్జీ
- సీఏఏ, ఎన్నార్సీలపై రిఫరెండం నిర్వహించాలని నిన్న మమత వ్యాఖ్యలు
- ఒపీనియన్ పోల్ నిర్వహించాలంటూ తాజా వ్యాఖ్య
- ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విన్నపం
పౌరసత్వ సవరణ చట్టంపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రెఫరెండం నిర్వహించాలంటూ మమతా బెనర్జీ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇచ్చారు. తాను రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) అని అనలేదని... ఓటింగ్ అని మాత్రమే అన్నానని చెప్పారు. ఈ ఓటింగ్ కూడా మానవహక్కుల కమిషన్ వంటి సంస్థ పర్యవేక్షణలో జరగాలని కోరానని అన్నారు. పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితాలపై ఒపీనియన్ పోల్ జరగాలని కోరారు.
దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పౌరసత్వ చట్టం విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని మమత విన్నవించారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. జాతీయ పౌర జాబితాను అమలు చేయాలనే ఆలోచనను కూడా విరమించుకోవాలని అన్నారు. దీన్ని రాజకీయపరమైన అంశంగా కాకుండా దేశానికి చెందిన అంశంగా చూడాలని కోరారు.
నిన్న కోల్ కతాలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మమత మాట్లాడుతూ, బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై రెఫరెండం నిర్వహించాలని... ఇందులో ఓడిపోతే బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు.