Christmas: క్రిస్మస్ తాత వేషంలో చిన్నారులకు కానుకలు తీసుకువచ్చిన విరాట్ కోహ్లీ
- క్రిస్మస్ నేపథ్యంలో కోహ్లీ కొత్త వేషం
- నిరుపేద చిన్నారుల్లో వెలుగులు నింపే ప్రయత్నం
- సామాజిక మాధ్యమాల్లో వీడియో సందడి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అందుకే తన పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజానికి తనవంతు సేవలు అందిస్తుంటాడు. తాజాగా కోహ్లీ నిరుపేద బాలబాలికల కోసం క్రిస్మస్ తాత అవతారమెత్తాడు. క్రిస్మస్ పర్వదినం రానున్న నేపథ్యంలో అనాథ చిన్నారుల ముఖాల్లో వెలుగులు నింపేందుకు కోహ్లీ తనవంతుగా కాస్త సమయం కేటాయించాడు.
క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ వేషంలో వచ్చిన కోహ్లీ కోల్ కతాలోని ఓ అనాథాశ్రమం చిన్నారులకు అనేక కానుకలు తీసుకువచ్చాడు. క్రిస్మస్ తాతలా ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ ఆపై మేకప్ తీసేయడంతో బాలబాలికలు ఆనందోత్సాహాలతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. కోహ్లీ కూడా వారితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ పండుగను ముందే సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.