Amaravathi: అమరావతిలో ఉద్రిక్తత... జీఎన్ రావు కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు యత్నించిన రైతులు
- సీఎంకు నివేదిక సమర్పించిన జీఎన్ రావు కమిటీ
- రాజధానిపై అధ్యయనం కోసం కమిటీ
- నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచన
- భగ్గుమన్న రాజధాని రైతులు
ఏపీ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. ఈ కమిటీ తమ నివేదికలో చేసిన సిఫారసుల పట్ల రాజధాని ప్రాంత రైతులు భగ్గుమంటున్నారు. కమిటీ నివేదికగా వ్యతిరేకంగా మందడం వై జంక్షన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. వెలగపూడిలో ఉన్న సచివాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రాజధాని అధ్యయన కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కమిటీ సభ్యులను వేరే మార్గంలో పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ దశలో రైతులు రోడ్డుకు బుల్ డోజర్ ను అడ్డంగా పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పురుషులు రోడ్డుపై పడుకోగా, మహిళలు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వానికి, జీఎన్ రావు కమిటీకి శాపనార్థాలు పెట్టారు. ఈ ధర్నాలో పలువురు చిన్నారులు సైతం పాల్గొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీఎన్ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను ఎప్పుడు తెలుసుకుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు, రాజధానిపై అధ్యయనం చేయడానికి జీఎన్ రావు కమిటీకి ఉన్న చట్టబద్ధత ఏంటని వారు నిలదీశారు.